సూర ఆరాఫ్ ఆయత్ 37,38,39
ఖుర్ఆన్ అవగాహనం
సూర ఆరాఫ్ ఆయత్ 37,38,39
فَمَنْ
اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰيٰتِهٖ١ؕ
اُولٰٓىِٕكَ يَنَالُهُمْ نَصِيْبُهُمْ مِّنَ الْكِتٰبِ١ؕ حَتّٰۤى اِذَا
جَآءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ١ۙ قَالُوْۤا اَيْنَ مَا كُنْتُمْ تَدْعُوْنَ
مِنْ دُوْنِ اللّٰهِ١ؕ قَالُوْا ضَلُّوْا عَنَّا وَ شَهِدُوْا عَلٰۤى اَنْفُسِهِمْ
اَنَّهُمْ كَانُوْا كٰفِرِيْنَ۰۰۳۷قَالَ
ادْخُلُوْا فِيْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ مِّنَ الْجِنِّ وَ الْاِنْسِ
فِي النَّارِ١ؕ كُلَّمَا دَخَلَتْ اُمَّةٌ لَّعَنَتْ اُخْتَهَا١ؕ حَتّٰۤى اِذَا
ادَّارَكُوْا فِيْهَا جَمِيْعًا١ۙ قَالَتْ اُخْرٰىهُمْ لِاُوْلٰىهُمْ رَبَّنَا
هٰۤؤُلَآءِ اَضَلُّوْنَا فَاٰتِهِمْ عَذَابًا ضِعْفًا مِّنَ النَّارِ١ؕ۬ قَالَ
لِكُلٍّ ضِعْفٌ وَّ لٰكِنْ لَّا تَعْلَمُوْنَ۰۰۳۸وَ قَالَتْ اُوْلٰىهُمْ لِاُخْرٰىهُمْ
فَمَا كَانَ لَكُمْ عَلَيْنَا مِنْ فَضْلٍ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ
تَكْسِبُوْنَؒ۰۰۳۹
నిజమే మరి,
పచ్చి అబద్ధాలను సృష్టించి అల్లాహ్ కు ఆపాదించే వానికి, లేదా అల్లాహ్ సత్యవచనాలను అబద్ధీకరించే వానికి మించిన దుర్మార్గుడు మరెవడు
కాగలడు?
ఇలాంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ వాటా ఏదో పొందుతూనే ఉంటారు." కడకు మేము పంపిన దైవదూతలు వారి
ఆత్మలను వశపరచుకునేందుకు (వారివద్దకు) వస్తారు. అప్పుడు వారు (దైవదూతలు) వారిని
ఇలా అడుగుతారు,
'చెప్పండి, మీరు దైవాన్ని
కాదని మొరపెట్టుకుంటూ ఉన్న ఆ మీ ఆరాధ్యులెక్కడ?’ వారు,
'అందరూ మాకు దొరక్కుండా జారుకున్నారు' అని పలుకుతారు. ఇంకా తాము నిజంగానే సత్య తిరస్కారులమని వారే స్వయంగా తమకు
వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తారు. అప్పుడు అల్లాహ్
* వారిని ఉద్దేశించి, 'పొండి, మీరున్నూ ఆ నరకంలోకే వెళ్ళిపోండి, అందులోనే మీకు
పూర్వం గతించిన జిన్నులూ మానవుల వర్గాలూ చేరి ఉన్నాయి' అని పురమాయిస్తాడు. ప్రతి వర్గం నరకంలోకి ప్రవేశించేటప్పుడు తనకు పూర్వపు
వర్గాన్ని తిట్టిపోస్తూ ప్రవేశిస్తుంది. చివరికి, అంతా అక్కడ గుమికూడినప్పుడు ముందు వచ్చిన ప్రతి వర్గాన్ని గురించి తరువాతి
వర్గం ఇలా అంటుంది,
'ప్రభూ, మమ్మల్ని దారి
తప్పించినవారు వీరే కనుక వీరికి నరకాగ్ని శిక్షను రెండింతలు చెయ్యి'. బదులుగా 'ప్రతి ఒక్కరికీ రెండింతల శిక్షే ప్రాప్తిస్తుంది కాని మీరెరుగరు?' అని సెలవీయడం జరుగుతుంది.
మొదటి వర్గం తరువాతి వర్గంతో ఇలా అంటుంది, '(మేము నిందార్హులమే అయినట్లయితే)మాకులేని గొప్పదనం మీకు మాత్రం ఏముందనీ, ఇక మీరు సంపాదించుకున్న దాని ఫలితంగా యాతనను మీరూ చవిచూడండి, 31 (14)
29. అంటే ప్రపంచంలో నిర్ణీతమయిన గడువు కాలం గడుపు
తారు. చూడటానికి మంచిదయినా, చెడ్డదయినా తమకు సంప్రాప్తమయిన జీవితాన్ని వెళ్ళదీస్తారు.
30. అంటే మీలోని ప్రతి వర్గం వారు, ఒక వర్గానికి తరువాతి వారయితే మరొక వర్గానికి
పూర్వీకులు కూడా. పూర్వీకులు తరువాతి వారి కొరకు ఆలోచన, ఆచరణల భ్రష్ట మార్గాలను వారసత్వంగా
విడిచివెళ్లినట్లయితే, ఆ తరువాతి వారున్నూ తమ తరువాత వచ్చేవారి కొరకు అలాంటి వారసత్వమే వదలి ప్రపంచం
వీడి పొయ్యారు. ఒక వర్గం దారి తప్పడానికి కొంత వరకు దాని పూర్వీకులు బాధ్యులయితే, ఆ వర్గం కూడా దాని తరువాతి వారి మార్గభ్రష్టతకు చాలా
మటుకు బాధ్యత వహించవలసి ఉంటుంది. అందువల్లనే ప్రతి వర్గానికీ రెండింతల శిక్ష
లభిస్తుందని చెప్పడం జరిగింది. ఒక వంతు శిక్ష స్వయంగా వారు తప్పుదారిని పాటించడం
వల్లనూ మరోవంతు ఇతరుల్ని దారి తప్పించడం చేతనూ, ఒకవంతు శిక్ష తమ అపరాధాలకు, మరో వంతు ఇతరులకు అపరాధాల వారసత్వం వదలి
వెళ్ళినందుకు.
హదీసులో ఈ విషయాన్నే ఇలా విశదపరచడం జరిగింది:
* దైవం, దైవప్రవక్తల దృష్టిలో అవాంఛనీయమయిన కొత్త
మార్గభ్రష్టతను ప్రారంభించిన వ్యక్తిమీద, ఆ కొత్త విధానాన్ని అనుసరించే వారందరి పాపభారం
మోపబడుతుంది. అయితే ఆ కారణంచేత అలా అనుసరించే వారి బాధ్యతను ఏమాత్రం తగ్గించడం
జరగదు. మరో హదీసులో ఇలా ఉంది: ప్రపంచంలో అన్యాయంగా ఏ మనిషి హత్య జరిగినా అతని అధర్మమైన హత్య పాపంలో ఒక వాటా, ఆదమ్ తొలి కుమారునికి చేరు తుంది. ఎందువల్లనంటే, తన సోదరుని హతమార్చి మానవ హత్యామార్గాన్ని
ప్రప్రథమంగా తెరచిన వాడు అతనే. దీనివల్ల తెలిసేదేమిటంటే ఏ వ్యక్తి అయినా మరే
వర్గమయినా ఒక తప్పుడు భావానికి లేక తప్పుడు వైఖరికి పునాది వేసినట్లయితే వారు
కేవలం తమ తప్పుకే కాదు, ప్రపంచంలో దానికి ప్రభావితు ప్రపంచంలో దానికి ప్రభావితు లయ్యే వారందరి పాపానికీ
కొంత బాధ్యత వహించవలసి ఉంటుంది. తప్పుడు ప్రభావాలు కొనసాగినంత కాలం వారి ఖాతాలో ఆ పాపపు
వాటాలు నమోదు అవుతూనే ఉంటాయి.
దీనివల్ల తేలే మరో అంశం ఏమిటంటే ప్రతివ్యక్తీ తన మంచీ
చెడులకు తన వరకు మాత్రమే బాధ్యుడు కాడు, తన మంచీ చెడులు ఇతరుల జీవితాలపై ఏ మేరకు ప్రభావం వేశాయన్న
ప్రశ్నకూ అతను జవాబు చెప్పుకోవలసి ఉంటుంది.
ఉదాహరణకు ఒక వ్యభిచారినే తీసుకోండి, ఎవరి శిక్షణవల్ల మరెవరి సహవాసం వల్ల, ఎవరి చెడు దృష్టాంతాలు చూడటం వల్ల, ఎవరి ప్రోద్బలం వల్ల ఈ వ్యక్తిలో వ్యభిచార
గుణం దారి చేసుకుందో వారంతా ఇతను వ్యభిచారి అవడంలో తోడ్పడిన వారే. స్వయంగా వారున్నూ
ఈ చెడు చూపు, చెడు తలంపు, చెడు నడతల వారసత్వం ఎక్కడి నుండి గ్రహించారో అక్కడి వరకూ దీని బాధ్యత చేరుతుంది.
కడకు, మానవాళి కాంక్షాతృప్తికి ఈ చెడుదారి చూపిన తొలి వ్యక్తి వరకూ దీని సంబంధం కొనసాగుతుంది.
ఇది ప్రస్తావనలోని ఆ వ్యభిచారి లెక్కలోని సమకాలీనులు, పూర్వీకులకు సంబంధించిన భాగం. పైగా, స్వయంగా అతను కూడా తాను చేసిన వ్యభిచారానికి
బాధ్యుడు. అతనికి ఇచ్చిన మంచీ చెడుల విచక్షణాజ్ఞానం, అతనిలో పొందు పరచిన అంతరాత్మ బలం, అతనిలో సహజంగానే సమకూర్చిన మనో నిగ్రహశక్తి, ప్రపంచంలోని సజ్జనుల ద్వారా అతనికి
అ౦దిన మంచీ చెడుల తెలివిడి, అతనికి తెలిసిన సత్పురుషుల ఆదర్శాలు, లైంగిక దురాచారం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి అతనికి
అందిన సమాచారం-వీటిలో దేని ద్వారానూ తను ప్రయోజనం పొందలేదు. అతను మనసు కోరే
గుడ్డి కోర్కె ముందు తన్ను తాను బానిసగా సమర్పించుకున్నాడు. మనసు కోరేది దాని
తృప్తిమటుకే, అది ఏ విధంగానయినా సరే! ఇదంతా వ్యక్తిగతంగా అతనికి సంబంధించిన లెక్క ఆ తరువాత
తాను సంపాయించి పెంచి పోషించిన ఆ చెడుగును ఇతరుల వరకు వ్యాపింపజెయ్యడం మొదలెడతాడు.
ఏదో సుఖవ్యాధిని అంటించుకు వస్తాడు, దాన్ని తన కుటుంబంలోనూ మరెన్నో వంశాలలోనూ
వ్యాపింపజేసి ఎన్నో జీవితాలను నాశనం చేస్తాడు. ఒక్కోచోట వ్యభిచరించి తన ఇంద్రియ
బిందువును వదలుతాడు. తద్వారా శిశువు కలిగితే, తాను పోషించవలసిన శిశువు భారాన్ని మరొకనిపై మోపుతాడు.
ఆ శిశువును ఆ మరొకని సంపాదనలో అక్రమ వాటాదారునిగా, అతని సంతానం హక్కుల్లో బలవంతపు భాగస్వామిగా, అతని వారసత్వంలో అధర్మపు హక్కుదారుగా
చేస్తాడు. ఈ హక్కుల అపహరణ ఎన్నెన్ని తరాల వరకు కొనసాగుతుందో! మాటల గారడితో ఒక
కన్యను దుర్నీతి మార్గాన పడవేస్తాడు. ఆమెలో పెంపొందించిన చెడుగుణాలు ఎన్నెన్నో
కుటుంబాలలో, మరెన్నో తరాల వరకు వ్యాపించి ఎన్నో ఇండ్లను కూల్చి వేస్తాయి. అలాంటి వ్యక్తి
తన సంతానం, తన చుట్టాలు, తన సమాజంలోని ఇతర జనుల సమక్షంలో తన అనైతికత ద్వారా ఒక చెడ్డ దృష్టాంతాన్ని
నిలుపుతాడు. ఎందరి నడతనో చెడగొట్టడానికి కారణభూతుడవుతాడు. దాని ప్రభావాలు ఆ
తరువాతి తరాలలో చాలా కాలం వరకు ప్రాకుతూనే ఉంటాయి. ఈ వ్యక్తి సమాజంలో రేపిన ఈ
సమస్త అల్లకల్లోలం పట్ల న్యాయం కోరేదేమిటి? దీని పాప ఫలితాలన్నీ అతని ఖాతాలో వ్రాయడమే న్యాయం.
ఇతను వ్యాపింపజేసిన చెడుగుల దుష్పరిణామాలు ప్రపంచంలో వ్యాపిస్తున్నంత కాలం అతని
లెక్కలో అవి నమోదవుతూనే వుండాలి. ఇదే న్యాయం.
ఇలాగే మంచిని కూడా ఊహించుకోవచ్చు. మనకు మన
పూర్వీకుల నుంచి ప్రాప్తించిన సచ్ఛీలత వారసత్వానికి పుణ్య ఫలం, సృష్టి ఆది నుండి మన కాలం వరకు
తరతరాలుగా దాన్ని అందజేయడంలో
పాలుపంచుకున్న వారందరికీ లభించాలి. ఆ వారసత్వాన్ని గ్రహించి దాన్ని భద్రపరచి, వృద్ధి పరచడంలో మనం అందించిన
సేవలకుగాను మనకూ దాని ప్రతిఫలం లభించాలి. ఇంకా మన సత్ప్రయత్నాల ఛాయల్ని వ్యక్తి
సంపా మనం వారసత్వంగా ప్రపంచంలో వదలి వెళ్ళుతున్నందుకు వాటి పుణ్యఫలం కూడా మన
పద్దులో జమ అవుతూ ఉండాలి. ఆ ఛాయలు మిగిలి ఉన్నంతకాలం, వాటి ప్రభావం మానవాళిపై
పరంపరాగతంగా పడుతున్నంతకాలం, వాటి ప్రయోజనాల వల్ల మానవులు లాభం పొందుతున్నంత కాలం, ఆ పుణ్యఫలం మన లెక్కలో జమ అవుతూ
ఉండాలి.
దివ్య ఖుర్ఆన్ ప్రతిపాదిస్తున్న ఈ ప్రతిఫల విధానం
ద్వారానే సరయిన, సంపూర్ణమయిన
న్యాయం సిద్ధించగలదని బుద్ధీ వివేకాలున్న
ప్రతి మనిషీ అంగీకరిస్తాడు. ఈ యదార్థాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మానవ ఆచరణల
ప్రతిఫలానికి ప్రస్తుత ఇహలోక జీవితమే చాలని భావించే వారి అపోహలు తొలగి పోతాయి.
అలాగే, మానవునికి అతని ఆచరణల పూర్తి ప్రతిఫలం జన్మల చక్రం ద్వారానే
లభిస్తుందని అనుకునేవారి అపోహలు కూడా దూరమవుతాయి. నిజానికి ఈ ఇరు వర్గాలున్నూ మానవ
ఆచరణలు, వాటి ప్రభావాలు, వాటి పరిణామాల విస్తృతిని అర్ధం చేసుకోలేదు, న్యాయవంతమైన ప్రతిఫలం, దానికి అవసరమయిన అంశాలనూ అవగతం చేసుకోలేదు. నేడు ఒక మానవుడు
తన యాభయి లేదా అరువయి యేళ్ళ జీవితంలో చేసే మంచి పనులయినా చెడ్డ పనులయినా వాటి బాధ్యత
అతని ఒక్కడిదే కాదు, గతించిన పై తరాలలో ఎందరు వాటిలో భాగం పంచుకున్నారో ఎవరికీ తెలీదు. వాటి పుణ్యఫలమయినా
శిక్షఅయినా వారికి లభించాలంటే నేడు అది సాధ్యపడదు. అంతేకాదు, ఈ వ్యక్తి నేడు చేస్తున్న సత్క్రియలైనా, దుష్క్రియ లయినా అతని మృత్యువుతో అంతమయి
పోవడం లేదు. వాటి ప్రభావాలు మున్ముందు శతాబ్దాల తరబడి కొనసాగుతాయి; కోటానుకోట్ల ప్రజల వరకు వ్యాపిస్తాయి.
అతని ఆచరణా పత్రంలో వాటి పద్దు ఉంటుంది. అతను చనిపోయినా ఆ ప్రభావాలు కొనసాగుతూ వ్యాపిస్తూ
ఉన్నంత కాలం ఆ ఖాతా తెరచే ఉంటుంది. ఈ ప్రపంచ జీవితంలోనే ఆ వ్యక్తికి అతని 'సంపాదన'కు పూర్తి ప్రతిఫలం లభించడం ఎలా సాధ్యమవు
తుంది? నిజానికి అతని సంపాదనా పరిణామాల వెయ్యోవంతు కూడా ప్రపంచ జీవితంలో ముందుకు రాదు.
పైగా ఈ పరిమిత ప్రపంచ జీవితం, ఇక్కడి పరిమిత అవకాశాలు, ఇక్కడ ఒక వ్యక్తి సంపాదించిన దాని ప్రతిఫలాన్ని
పూర్తిగా పొందేందుకు వీలు కల్పించలేవు. .
ఈ ప్రపంచంలో ఒక మహా సంగ్రామానికి చిచ్చు పెట్టినటువంటి
వ్యక్తి చేసిన అపరాధాన్ని గురించి ఊహించండి, అతను చేసిన ఈ చేష్ట కారణంగా అసంఖ్యాకమయిన దుష్ప్రభావాలు
వేలవేల ఏళ్ళ వరకు కోటానుకోట్ల ప్రజల వరకు వ్యాపిస్తూ ఉంటాయి, ఇప్పుడు చెప్పండి. ఈ ప్రపంచ జీవితంలో
విధించ వీలుగల అతి ఘోరమయిన శారీరక, నైతిక, ఆధ్యాత్మిక, భౌతిక శిక్ష ఏదయినా సరే, అతను చేసిన ఈ అపరాధానికి పూర్తిగా న్యాయవంతమయిన
శిక్ష కాగలదా? అలాగే, ఒక వ్యక్తి తన జీవితాంతం మానవాళి మంచి కొరకు పాటుపడుతూనే గడపగా అతని ఈ కృషి ఫలాలను
వేనవేల ఏళ్ళ వరకు అసంఖ్యాకజనం అనుభవిస్తూనే వుంటారు. మీరు ఊహించగల మహోన్నత మయిన ఏ బహుమానమయినా
ఈ వ్యక్తికి సరిపోతుందా? ఆచరణ, దాని ప్రతిఫలాల సమస్యను ఈ కోణంలో పరిశీలించిన వ్యక్తి, ప్రతిఫలానికి మరో వ్యవస్థ అవసరమని గట్టిగా
నమ్ము తాడు- అక్కడ ముందు తరాలు, తరువాతి తరాలు అన్నీ సమావేశమవ్వాలి; మానవుల ఆచరణల పద్దులు సర్వం మూసివెయ్యాలి, లెక్కలు చూడటానికి సర్వోపరిజ్ఞాని, సకల సమాచార వైదుషి అయిన ప్రభువు న్యాయపీఠాన్ని
అలంకరించి ఉండాలి, ఇంకా తన ఆచరణల ప్రతిఫలాన్ని అనుభవించడానికి మనిషికి అపరిమిత జీవితం, అతని చుట్టుప్రక్కల్లో సద్ఫలిత, దుష్ఫలితాలను అనుభవించేందుకు అపరిమిత
సాధనాలు ఉండాలి - ఇలాంటి ఒక వ్యవస్థ అవసరమని సాధారణ బుద్ధీ, జ్ఞానాలున్న ఏ వ్యక్తి అయినా విశ్వసిస్తాడు.
ఈ కోణంలోనే ఆలోచిస్తే జన్మల చక్రాన్ని నమ్మేవారి ఒక మౌలిక
మయిన తప్పు కూడా పరిష్కృతమవుతుంది. ఆ తప్పులోపడి వారు జన్మజన్మల చక్రాన్ని ప్రతిపాదించారు.
కేవలం యాభయి ఏళ్ళ స్వల్పమయిన జీవితకాలంలో చేసిన ఆచరణల ఫలాలను పొందడానికి దానికన్నా
ఎన్నో వేలరెట్ల సుదీర్ఘ జీవితం అవసరమయినప్పుడు, ఈ యాభయి ఏళ్ళ జీవితం ముగియగానే మరో జీవితం, ఆ తరువాత ఇంకొక జీవితం, ఇలా బాధ్యతా యుతమయిన జీవనకాలాలు ఈ ప్రపంచంలోనే
ప్రారంభ మవుతూ వుంటే, ఈ జీవితాల్లోనూ ప్రతిఫలం పొందవలసిన మంచీ చెడు పనులు చేస్తూ ఉంటే ఇక దానికి అంతు
ఏది?
ఈ విధంగా ఈ జన్మల చక్రం వల్ల లెక్క ముగియటం అలా ఉంచి అది
మరింత పెరుగుతూనే ఉంటుంది, అది ముగిసే అవకాశమే ప్రాప్తం కాదు. ఈ ప్రతిపాదన చేసే వారికి ఈ ప్రత్యక్ష యదార్థం
బోధపడలేదనే చెప్పవలసి ఉంటుంది.
Comments
Post a Comment